ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో ఇటీవల అలజడి రేపుతున్న పులి కెమెరాకు చిక్కింది. పులి కోసం వారం రోజులుగా ఫారెస్ట్ ఆఫీసర్లు చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ ఎట్టకేలకు సఫలమైంది. శనివారం సాయంత్రం పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కాగజ్ నగర్ ఎఫ్డీవో ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. గత నెల 29న మోర్లే లక్ష్మి మీద దాడి చేసి హతమార్చిన, రౌత్ సురేశ్‌పై దాడికి పాల్పడిన పెద్దపులి కెమెరాకు చిక్కినట్లు చెప్పారు. ఇది మహారాష్ట్ర పెద్దపులిగా తెలుస్తుందని తెలిపారు.
సిర్పూర్(టి) ఫారెస్ట్ లో కెమెరాకు చిక్కినట్లు ఆయన వివరించారు. మహారాష్ట్రలో, ఇక్కడి కెమెరా ట్రాప్ లో పులి ఒకేలా ఉందని, పులికి సంబంధించిన వివరాలు తెలియదని, కొత్త పెద్దపులిగా భావిస్తున్నట్లు చెప్పారు.4 నుంచి 5 ఏండ్ల మగ పెద్దపులి అని, కాగజ్‌నగర్ ఫారెస్ట్ లో 5 పెద్దపులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తూ వెళ్తుంటాయని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమకు సహకరించాలని కోరారు. వైల్డ్ లైఫ్ చీఫ్ ఏలుసింగ్ మేరా, ఆసిఫాబాద్ డీఎఫ్ వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఉన్నారు.